Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

Tirupati smart city.

Recommended Posts

గగన వీధిలో..!
తిరుచానూరు నుంచి అలిపిరి వరకూ పైవంతెన
ప్రతిపాదనలు సిద్ధం చేసిన తుడా, కార్పొరేషన్‌
ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా ప్రాజెక్టు
ctr-top1a.jpg

దినదినాభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో ట్రాఫిక్‌ రద్దీ ప్రధాన సమస్యగా పరిణమించింది. ఒకప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే పేరున్న తిరుపతి.. నేడు రాయలసీమకు వాణిజ్య, విద్యా, వైద్య రాజధానిగా అవతరించింది. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా ఎదిగింది. జనాభా పెరుగుదల కూడా రాష్ట్ర సగటుకు మించిపోయింది. స్వల్పకాలంలోనే నగరంగా వృద్ధి చెందిన తిరుపతి.. ఆ మేరకు పౌరులకు సేవలందించలేకపోతోంది. పంచాయతీగా, మున్సిపాలిటీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు.. స్థానికులు, యాత్రికుల అవసరాలకు తీర్చలేకపోతున్నాయి. వెరసి రవాణా పెద్ద సవాలుగా మారింది. దీన్ని అధిగమించేందుకు తిరుపతి నగరపాలక సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) సంయుక్తంగా రూపొందించిన ప్రణాళిక మేరకు భారీ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కసరత్తు మొదలైంది.

న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక)

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి నిత్యం వచ్చే సుమారు లక్ష మంది భక్తులతో పాటు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, వైద్య అవసరాల కోసం వచ్చే వారితో నిత్యం తిరుపతి నగరం కిటకిటలాడుతోంది. ఎన్నో అనుకూలతల కారణంగా తిరుపతిలో స్థిరపడడం ఓ వరంగా భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. 30 ఏళ్ల క్రితం ఉన్న రోడ్లు, ఇతర సదుపాయాలు నేటికీ అలాగే ఉన్నాయి. కొంత కాలంగా అవి కూడా కుదించుకుపోతున్నాయి. 40 ఏళ్ల నాటితో పోల్చితే.. వాహనాల రద్దీ, నగర జనాభా, తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. అదే రోడ్లు, అవే వీధులు రద్దీ మాత్రం పెరగడంతో ఫ్లైఓవర్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. స్మార్ట్‌సిటీ నిధులతో 18 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ నిర్మించి నగరంలోని ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పదేళ్ల క్రితం ఇదే ప్రతిపాదనల వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో  భాగంగా తిరుపతిలో ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని నమూనాలు సిద్ధం చేసినా నిధుల లేమితో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. విలీన గ్రామాలతో కలిపి 24.77 చ.కి.మీ విస్తరించిన తిరుపతి నగరపాలికకు ఈ ఫ్లైఓవర్‌ ఓ వరంగా కార్పొరేషన్‌ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న తిరుమల బైపాస్‌ రోడ్డును, తిరుచానూరు రోడ్డుపైన స్తంభాలను నిర్మించి ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు.

ఫ్లైఓవర్‌ల అవశ్యకత
నగరంలోని నాలుగు లక్షల జనాభాతో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజుకు లక్ష తగ్గడం లేదు. తిరుపతిలో నిత్యం 3650 బస్సుల్లో 1.30 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన 260 బస్సులు నగరం మీదుగా నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు 300 నిత్యం తిరుపతికి ప్రయాణికులను తరలిస్తున్నాయి. తిరుపతి నగరానికి ఆర్టీసీ, యాత్రికుల ప్రైవేటు బస్సులు కలిసి సగటున నాలుగువేల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 20 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా నిత్యం 70 నుంచి 85 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. యాత్రికుల్లో 40 శాతం మంది సొంత వాహనాలు, అద్దె వాహనాల్లో వస్తున్నట్లు సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. నిత్యం 50 వేల కార్లు, ఇతర వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల వినియోగం 200 శాతం పెరిగింది. ప్రస్తుతం 80 వేల ద్విచక్ర వాహనాలు రోడ్లపైన తిరుగుతున్నాయి. వీటికి తోడు నగరాన్ని చుట్టుముట్టిన 20 వేలకు పైగా ఆటోలు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. రోడ్ల విస్తీర్ణం ఆక్రమణల కారణంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్‌ తప్పనిసరి అని అలోచించారు.

ఎక్కడి నుంచి ఎక్కడికంటే..
తిరుపతిలో ట్రాఫిక్‌ నియంత్రణకు ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని స్మార్ట్‌సిటీలో ప్రతిపాదించారు. అందుకోసం రూ.70 కోట్లు, రూ.128 కోట్లు, రూ.180 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వీటిని ఇటీవల జరిగిన స్మార్ట్‌సిటీ పాలకమండలి సమావేశంలో చర్చించారు. అయితే స్మార్ట్‌ సిటీ ప్రతిపాదనల తయారీ సంస్థ ఎయికామ్‌ రూపొందించిన మూడు నమూనాలు అధికారులను మెప్పించలేకపోవడంతో సరికొత్త ప్రతిపాదనలతో వచ్చే పాలకమండలి సమావేశంలోపు సమగ్రంగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. రామానుజ కూడలి నుంచి బస్టాండ్‌, లీలామహల్‌ కూడలి, కపిలతీర్థం నుంచి గరుడాకూడలి వరకు ఫ్లైఓవర్‌ అవసరం ఉందని ఒక ప్రతిపాదన, తిరుచానూరు ఫ్లైఓవర్‌ను అనుసంధానిస్తూ రామానుజకూడలి, బస్టాండ్‌, లీలామహల్‌ కూడలి, కపిలతీర్థం, గరుడ కూడలి వరకు మరో ప్రతిపాదనల సిద్ధం చేశారు. ఎక్కువ శాతం మంది సభ్యులు తిరుచానూరు నుంచి గరుడా కూడలి వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణానికి అసక్తి కనబరిచారు. అయితే రైల్వేస్టేషన్‌ను సైతం ఫ్లైఓవర్‌కు అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను దాదాపుగా పరిష్కరించవచ్చని జిల్లా పాలనాధికారి పీఎస్‌ ప్రద్యుమ్న సూచించారు. స్మార్ట్‌సిటీ ప్రతిపాదనల తయారీ సంస్థ ఎయికామ్‌తో పాటు జిల్లా యంత్రాంగం ద్వారా జిల్లా పాలనాధికారి సైతం ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్‌ రద్దీ ప్రాంతాల్లో ఆటో, కారు డ్రైవర్లు, ఆర్టీసీ, రైల్వే అధికారులు, యాత్రికుల వాహనాలు, రద్దీ సమయాల్లో ఏ కూడలిలో ఎంత సమయం ట్రాఫిక్‌ స్తంభిస్తున్నది, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ప్రద్యుమ్న ఆదేశించడంతో సర్వే ప్రారంభమైంది.

నగర విస్తరణ
తిరుపతి నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రభుత్వం నగరంలోని పేదల కోసం దామినేడు, తనపల్లె, పాడిపేట, అవిలాల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. తొమ్మిది వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఈ ఇళ్లకు చేరుకోవడానికి లబ్ధిదారుల్లో కాస్త నిరాసక్తత ఉంది. ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయితే ప్రజలు ఇక్కడ నివసించేందుకు ముందుకువస్తారు.  పద్మావతి కల్యాణ మండపాల వద్ద పెళ్లిళ్ల సీజన్‌లో 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ స్తంభించే అవకాశం ఉంది. తిరుచానూరు నుంచి గరుడా కూడలి వరకు ఫ్లైఓవర్‌ నిర్మించడంతో పాటు ఎయిర్‌బైపాస్‌రోడ్డు, బస్టాండ్‌ కూడలి, లీలామహల్‌ కూడలి వద్ద కరకంబాడి రోడ్డును అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొన్ని కూడళ్లలో 10 నుంచి 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌ స్తంభిస్తున్నది. రైల్వేస్టేషన్‌ నుంచి బస్టాండ్‌ వరకు తితిదే 500 మీటర్లు నడకకు ఉపయోగపడేలా ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గనుంది.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×